అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం
అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవం కన్నుల పండవగా జరిగింది. బాల రాముడి రూపంలో శ్రీరాముడు గర్భగుడిలో ప్రతిష్టంపబడ్డాడు. కోట్లాది మంది భక్తులు కొలిచే అయోధ్య రామాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆలయ నిర్మాణంలో ముక్క ఇనుమును కూడా అసలే వినియోగించలేదు. వేల ఏళ్లపాటు ఉండేలా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అయోధ్య రామాలయానికి సంబంధించిన 10ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. అయోధ్యలోని రామమందిరం వైశాల్యం 2.7 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయాన్ని 57,400 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. 2. ప్రముఖ వాస్తు శిల్పి చంద్రకాంత్ సోంపురా రామ మందిర నిర్మాణ రూపకల్పనను చేశారు. నాగరా శైలిలో ఆలయ నిర్మాణాన్ని రూపొందించారు. చంద్రకాంత్ సోంపురా కుటుంబం 15 తరాలకు పైగా 100 దేవాలయాలను రూపొందించింది.
6.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలను తట్టుకునేలా..
3. ఆలయం 2,500 ఏళ్ల మన్నిక ఉండేలా.. 6.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలను తట్టుకునేలా ఆలయాన్ని నిర్మించారు. 4. రామాలయంపొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. శిఖరంతో సహా ఆలయం ఎత్తు 161 అడుగులు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఆలయంలోని ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉంటుంది. 5. శ్రీరామ మందిరాన్ని స్తంభాలతో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 పిల్లర్లు ఉండగా, మొదటి అంతస్తులో 132 పిల్లర్లు, రెండో అంతస్తులో 74 పిల్లర్లు ఉన్నాయి. 6. మూడు అంతస్తుల రామ మందిరం ఒక్కో అంతస్తును 20 అడుగుల ఎత్తుతో నిర్మించారు. భవిష్యత్‌లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రతి అంతస్తులో తగినంత ఉండేలా జగ్రత్తలు తీసుకున్నారు.
రూ.1800 కోట్లతో రామాలయ నిర్మాణం
7. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన పింక్ ఇసుకరాయిని ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించారు. ఆలయ ఎక్కువ కాలం ఉండేందుకు తెలుపు మక్రానా పాలరాయి, గుల పాలరాయిని నిర్మాణంలో ఉపయోగించారు. 8. 'రామ శిల' ఇటుకలను ఆలయం నిర్మాణలో ఉపయోగించారు. ఈ ఇటుకలు రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లతో సమానమని చెబుతుంటారు. 9. ఆలయం నిర్మాణానికి నేపాల్ గండకి నదిలో దొరికిన శిలాగ్రామ రాయిని ఉపయోగించారు. శాలిగ్రామం విష్ణువు చిహ్నంగా పురాణాలు చెబుతున్నాయి. 10. ఆలయ సుందరీకరణ, నిర్మాణం కోసం మొత్తం రూ.1800కోట్లు ఖర్చు అవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర తెలిపింది. 2020 ఫిబ్రవరి 5 నుంచి 2023మార్చి 31మధ్య రామ మందిర నిర్మాణానికి రూ.900కోట్లు ఖర్చు చేశారు.