
Ayodhya: అయోధ్య రామమందిరానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోని రామాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది.
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టరేట్లకు ఈ-మెయిల్‌లు పంపిస్తూ రామాలయాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు.
ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఆలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించారు.ఈ నేపథ్యంలో అయోధ్య సైబర్ క్రైం పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు.
ఈ బెదిరింపు మెయిల్ తమిళనాడులోని ఒక ప్రాంతం నుంచి ఇంగ్లీష్ భాషలో వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఈ మెయిల్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు.
కేవలం అయోధ్యకు మాత్రమే కాకుండా, బారాబంకి, ఇతర సమీప జిల్లాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు.
వివరాలు
గోడ నిర్మాణానికి 18 నెలల సమయం
ఇదే తరహాలో గతంలోనూ అయోధ్య రామాలయాన్ని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు వచ్చాయి.
ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ అప్పట్లో ఇదే విధంగా బెదిరించాడు.ఈ తరహా ప్రమాదాల నేపథ్యంలో రామాలయం,అయోధ్య నగరంలో సెక్యూరిటీ చర్యలు మరింత కఠినంగా అమలులోకి తెచ్చారు.
ఈ ప్రాంతాన్ని పూర్తిగా డ్రోన్ నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు. రామాలయ భద్రతను మరింత బలపర్చే ఉద్దేశంతో, దాదాపు 4 కిలోమీటర్ల పొడవున గోడ నిర్మాణాన్ని ప్రారంభించినట్టు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.
ఈ నిర్మాణ పనులు "ఇంజినీర్ ఇండియా లిమిటెడ్" అనే సంస్థచే చేపట్టబడుతున్నాయని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేందుకు సుమారు 18 నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు.