ఆయుష్మాన్ భారత్‌పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు
భారత్‌లో అమలవుతోన్న ఆరోగ్య పథకాలు, వైద్య సేవలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు వర్షం కురిపించింది. భారత్‌లో ఆరోగ్య విధానాలు అద్భుతంగా ఉన్నాయంటూ డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం భేష్ అని కొనియాడారు. ఇంతటి స్థాయిలో ఈ సదస్సును నిర్వహించినందుకు ముందుగా కృతఙ్ఞతలని, ఆరోగ్య విషయంలో భారత దేశంలో అనుసరిస్తోన్న విధానాలు అద్భుతమని వెల్లడించారు.
టెలి మెడిసన్ సౌకర్యం అద్బుతంగా ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
తాను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌కు వెళ్లాలని, అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయానని, గుజరాత్ లోని టెలి మెడిసన్ సౌకర్యం కూడా చాలా అద్భుతంగా ఉందని డా.టెడ్రోస్ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు సూమారు 70దేశాల నుంచి ఆరోగ్య మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని, జీ20 అధ్యక్ష హోదాలో ఈ సదస్సు ద్వారా భారత్ అవలంభిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని, మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశామన్నారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు నేటితో ముగియనున్నాయి