Baba Siddique: బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో బాబా సిద్ధిఖీ కుమారుడు
ఎన్సీపీ కీలక నేత, బాలీవుడ్ మిత్రుడు,మాజీ మంత్రి బాబా సిద్దిఖీ (66)హత్యతో ముంబయి నగరం ఉలిక్కిపడింది. ఆ కేసును విచారిస్తున్న పోలీసులకు మరో కీలక విషయం తెలిసింది.ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. తండ్రీ కుమారులను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు షూటర్లు విచారణలో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్దిఖీ,ఆయన కుమారుడు ఉంటారని తమకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు చెప్పారని షూటర్లు వెల్లడించారు. ఇద్దరిపైనా దాడి చేసే వీలులేకపోతే..ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని ఆదేశించారు. జీషన్ సిద్దిఖీ కాంగ్రెస్ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది.
మహారాష్ట్రలో హత్య కలకలం
ముగ్గురు దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన సమయంలో బాబా సిద్దిఖీ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతున్న సమయంలో నవరాత్రి ఊరేగింపులో బాణసంచా కాలుస్తుండటంతో కాల్పుల శబ్దం బయటకు వినిపించలేదు. ఇది కిరాయి హత్యగా ఉండవచ్చని, వ్యాపార లావాదేవీల్లో గానీ, మురికివాడ అభివృద్ధి ప్రాజెక్టులో విభేదాల వల్లగానీ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్దిఖీని తామే చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న మహారాష్ట్రలో ఈ హత్య కలకలం రేపుతోంది.