Ban on firecrackers: ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
రాజధాని నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం,పేల్చడంపై సమగ్ర నిషేధం విధిస్తూ దిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. గ్రీన్ ఫైర్ క్రాకర్స్ పేల్చేందుకు కోర్టు అనుమతించినప్పటికీ పటాకులపై పూర్తి నిషేధం విధించినట్లు బీజేపీ లోక్‌సభ ఎంపీ మనోజ్ తివారీ న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. మాకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, అంతగా మీరు పటాకులు కాల్చాలనుకుంటే, నిషేధం లేని రాష్ట్రాలకు వెళ్లండంటూ ధర్మాసనం తివారీకి తెలిపింది.
కాలుష్యం పెరగడం వల్ల పిల్లలు,వృద్ధులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు
ప్రజలకు పటాకులు పేల్చకూడదని అర్థం అయ్యేటట్టు మీరు చెప్పాలి. అంతేగాని మీరు ఎన్నికల విజయోత్సవ ఊరేగింపులలో పటాకులను పేల్చకూడదని మీ విజయాన్నిఆనందించడానికి ఇతర మార్గాలు ఉన్నాయని తివారీకి ధర్మాసనం తెలిపింది. శీతాకాలంలో అధిక కాలుష్య స్థాయిలను ఎదుర్కోవడానికి, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, నిల్వ,అమ్మకం,పేల్చడంపై సమగ్ర నిషేధాన్ని ప్రకటించారు. పటాకులు కాల్చడం వల్ల చలికాలంలో కాలుష్యం పెరగడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఎదురయ్యే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను ఆయన హైలైట్ చేశారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) ఈ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలను పంపిణీ చేసే పనిలో ఉందని ఆయన చెప్పారు.