బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోకు సబంధించిన యూట్యూబ్ లింకులను కేంద్రం భ్యాన్ చేయడంపై జాతీయస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీసుకున్న చర్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం, మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. బ్రిటీష్ చట్టాల ఆధారంగానే దేశంలో ట్విట్టర్, యూట్యూబ్‌లో డాక్యుమెంటరీ లింకులను బ్యాన్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో ఎవరైనా అంతరిక్షం నుంచి వచ్చి ప్రజలను చంపారా? అని ఆయన ప్రశ్నించారు.
గాంధీని హత్య చేసిన గాడ్సేపై కేంద్రం వైఖరి చెప్పాలి: ఒవైసీ
గాంధీని హత్య చేసిన గాడ్సేపై కేంద్రం, బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. గాడ్సేపై తీస్తున్న సినిమాను ప్రధాని మోదీ బ్యాన్ చేస్తారా? దమ్ముంటే గాడ్సే సినిమాపై నిషేధం విధించాలని బీజేపీకి సవాల్ విసిరారు. గాంధీ వర్ధంతి అయిన జనవరి 30వరకు గాడ్సే సినిమా విడదుల కాకుండా నిషేధించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. 'గాంధీ గాడ్సే' పేరుతో చిత్రీకరించిన సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది. బీబీసీ డాక్యుమెంటరీపై టీఎంసీ కూడా స్పందించింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ చక్రవర్తి, ఆ పార్టీ సభ్యులు అభద్రతతో ఉండటం సిగ్గుచేటని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు.