Digvijay Singh: మధ్యప్రదేశ్‌లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హర్యానా నుహ్ తరహాలో అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. భోపాల్‌లో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జులై 31న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నిర్వహించిన మతపరమైన ఊరేగింపుపై ముస్లిం గుంపు రాళ్లు రువ్వడంతో అల్లర్లు హర్యానాలోని నుహ్ జిల్లాను చెలరేగాయి. ఆ అల్లర్లు గురుగ్రామ్, దిల్లీతో పాటు ఇతర పొరుగు ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ హింసలో ఆరుగురు మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీపై తీవ్ర అసంతృప్తి: దిగ్విజయ్
నుహ్ జిల్లా తరహాలో మధ్యప్రదేశ్‌లో అల్లర్లను ప్రేరేపించడానికి బీజేపీ యోచిస్తున్నట్లు తనకు సమాచారం ఉందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇలాంటి అల్లర్లను రెచ్చగొట్టడానికి ఒక వ్యూహం కూడా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీపై తీవ్రమైన అసంతృప్తి ఉందని, దాన్ని కప్పిపుచ్చేందుకు అల్లర్లను ప్రేరేపించేందకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అలాగే ఓటమిని ముందే గ్రహించే గొప్ప శక్తి బీజేపీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. తర్వలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
దిగ్విజయ్ సింగ్ బీజేపీ ఫైర్
దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని విమర్శించడమే దిగ్విజయ్ పనిగా పెట్టుకున్నారన్నారు. కాషాయ పార్టీ అభివృద్ధి రాజకీయాలు మాత్రమే చేస్తుందని ఆయన అన్నారు. వివాదాస్పద సమస్యలను సృష్టించడం మాత్రమే దిగ్విజయ్ పని వీడీ శర్మ అన్నారు. బీజేపీపై దిగ్విజయ్ సింగ్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది తొలిసారి కాదు. గత వారం, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాలలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ఆలయానికి వేల కోట్ల రూపాయలు సమకూరాయని, ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి నివేదిక అందించలేదని విర్శించారు.