Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు..సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ- స్కూళ్లు బంద్..!!
బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం వరకు 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.ఈ వానలకు బెంగళూరు తడిచి ముద్దై, ఉక్కిరిబిక్కిరవుతోంది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, చిక్కమగళూరు, కొడగు, కోలారు, రామనగర, శివమొగ్గ, తుమకూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చామరాజనగరలో ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా, నేడు, రేపు (బుధ, గురు) ఆరంజ్ అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. చిక్కబళ్లాపుర, రామనగర, కోలారు, కొడగు, బెళగావి, ధార్వాడ, గదగ జిల్లాల్లో గురు, శుక్రవారాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హావేరి, హాసన జిల్లాల్లోనూ భారీవర్షాలు కొనసాగనున్నాయి.
దేవీరమ్మహళ్లి పరిధిలో కూలిన ఇల్లు
చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బేగూరు సమీపంలోని కమరహళ్లిలో చెరువు నిండడంతో గట్టు తెగిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు చేరడంతో రైతులు పంపు సెట్లలో ఎక్కువ నీరు వస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. బేగూరులో ఇద్దరి ఇళ్ల గోడలు, పైకప్పు కూలాయి, అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నంజనగూడు తాలూకా దేవీరమ్మహళ్లి పరిధిలో మల్లిగమ్మ అనే మహిళ ఇల్లు కూలిపోయింది. ముందుగా ఇంట్లో ఉన్న ఏడుగురు బయటకు వచ్చి ఉండడంతో వారి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంట్లోని నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి.
బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశం తాత్కాలికంగా రద్దు
హావేరి సమీపంలోని కనకాపుర గ్రామం వద్ద ఎగువ తుంగ కాలువ కట్ట తెగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పొలాల్లోకి నీరు చేరింది. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుసెనగ పంటలు దెబ్బతిన్నాయి. ఉడుపి,మంగళూరులోని బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. రాజధాని నగరాన్ని వానభయం పట్టుకుంది.సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలో ఉష్ణోగ్రతలు 19డిగ్రీలకు చేరుకుంది. నగర శివార్లలో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా నమోదయ్యాయి. శుక్రవారం వరకు వర్షం ఇదే తరహాలో కొనసాగితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో వర్షం తాత్కాలికంగా తగ్గినప్పటికీ, సాయంత్రం మళ్లీ జోరందుకుంది. భారీ భవంతులపై నుంచి చూస్తే, జల్లుల మధ్య నగరంపై మంచు దుప్పటి ఆవరించుకున్నట్లుగా కనిపించింది.
వాహన రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ జామ్
హెణ్ణూరు రహదారిపై నడుము లోతులో నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు ముందుకు వెళ్లకుండా నిలిచిపోయాయి. ఇంటి నుంచే ఎక్కువ మంది తమకు కావలసిన ఆహార పదార్థాలను తెప్పించుకున్నారు. కాఫీ, టీ, బజ్జీలు, మసాలాపూరి విక్రయించే హోటళ్లు, దుకాణాల వద్ద రోజంతా రద్దీ కనిపించింది. బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మెజెస్టిక్, రైల్వేస్టేషన్, టోల్‌గేట్ల వద్ద వాహన రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విధులకు హాజరయ్యే వారు బీఎంటీసీ, మెట్రోపై ఆధారపడడంతో అవి కూడా రద్దీగా తిరిగాయి.