Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)' ఆదివారం (జనవరి 14) ప్రారంభం కానుంది. మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం 12:00 గంటలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. రాహుల్ గాంధీతో పాటు మరో 60-70 మంది ఈ యాత్రలో రాహుల్‌తో పాటు నడవనున్నారు. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 2024 ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మార్చి 20న ముగియనుంది.
అనుమతి నిరాకరించిన ఎన్.బీరెన్‌సింగ్ ప్రభుత్వం
వాస్తవానికి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్.బీరెన్‌సింగ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చివరికి పరిమిత సంఖ్యలో నాయకులు పాల్గొనే తౌబాల్ జిల్లా నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇది వరకే రాహుల్ గాంధీ కన్యాకుమారి -కాశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. మొదటి దఫా నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర'కు విశేష స్పందన వచ్చింది. దాదాపు 3,500 కి.మీ 'భారత్ జోడో యాత్ర' 12 రాష్ట్రాల గుండా సాగింది. ఈ యాత్ర వల్ల ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నెలకొంది.
15 రాష్ట్రాల్లో న్యాయ్ యాత్ర
'భారత్ జోడో న్యాయ్ యాత్ర' తూర్పు భారత నుంచి నుంచి పడమర వరకు 15 రాష్ట్రాల్లో ఇది సాగనుంది. 'భారత్ జోడో యాత్ర' కంటే దాదాపు రెట్టింపు దూరం న్యాయ్ యాత్ర ఉంటుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ 67రోజుల వ్యవధిలో 15రాష్ట్రాల్లోని 110జిల్లాల గుండా వెళతారు. గత 10ఏళ్లలో జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్యాయాలను ఈ యాత్ర ద్వారా ఎండగట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. 'న్యాయ్ యాత్ర' దేశంలోని మొత్తం పార్లమెంటరీ సీట్లలో 65శాతం ఉన్న 355లోక్‌సభ స్థానాలను కవర్ చేస్తుంది. 2019లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 355 స్థానాలకు గాను 236 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ 14 మాత్రమే గెలుచుకోగలిగింది.