Telangana: మా వాటాను 41% నుంచి 50% పెంచండి.. 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని ప్రజాభవన్ లో జరుగుతున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం,ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వాటాను 41% నుండి 50% వరకు పెంచాలని సూచించారు. రైతు భరోసా,రైతు రుణమాఫీ రాష్ట్రానికి అత్యంత అవసరమైనవి అని చెప్పారు.ఈ విధానాలు ప్రజలకు ఆర్థిక భరోసా,అధిక భద్రతను అందిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర పథకాలను అమలు చేయడానికి తరచూ కఠినమైన నిబంధనలు ఉంచడం వల్ల రాష్ట్రాలు అవరోధాలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను రూపొందించడానికి స్వాతంత్యాన్ని అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కీలక దశలో ఉన్నది,మరింత వేగంగా అభివృద్ధి సాధించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
6.85 లక్షల కోట్ల పైగా రుణభారం
గత ఆర్థిక సంవత్సరానికి ముగిసే సమయానికి,రాష్ట్రం 6.85 లక్షల కోట్ల పైగా రుణభారం కింద ఉందని వివరించారు. సెస్‌లు,సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని అభ్యర్థించారు.స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం,మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా సమాజంలోని అంతరాలను పరిష్కరించవచ్చని తెలిపారు. ఇది తెలంగాణకు మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశమని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని,చారిత్రిక కారణాల వల్ల అసమాన అభివృద్ధి ఉందని చెప్పారు. తలసరి ఆదాయం ఎక్కువ అయినప్పటికీ,సంపద,ఆదాయంలో భారీ అంతరాన్నిపేర్కొని, ఈ అసమానతల కారణంగా రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమయ్యిందని గుర్తుచేశారు. సమానతను సాధించేందుకు మౌలిక సదుపాయాలు,సంక్షేమ రంగంపై మరింత ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు.