Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్..
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మొదటిసారి రైతు రుణమాఫీని అమలు చేసిన ప్రధాని, నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ఇచ్చిన మన్మోహన్ సింగ్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో,మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంతాపం,అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
మన్మోహన్ సింగ్ దేశంలోని అసమానతలను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు గొప్పవని, ఆయన అరుదైన వ్యక్తి అని కొనియాడారు.
సమాచార హక్కు చట్టం, తదితర చట్టాలను తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనదేనని తెలిపారు.
వివరాలు
ఆర్థిక, సామాజిక పరిస్థితులపై దృష్టి
"ఎందరో వస్తారు, కానీ కొందరే ఈ భూమిపై మానవీయ పరిమళాలను వెదజల్లుతారు.
అందులో మన్మోహన్ సింగ్ ఒకరు." తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన మద్దతు లేకపోయినా, ప్రతిపక్షాలను ఒప్పించి, సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసిన విధానం మరిచిపోలేని ఘనత అన్నారు.
ఆయన ప్రతి పదవిలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకొని దేశం ఆర్థిక, సామాజిక పరిస్థితులపై దృష్టి పెట్టి అనేక చట్టాలు ప్రవేశపెట్టారని అన్నారు.
వివరాలు
స్కావెంజర్స్ చట్టం రద్దు
సామాన్యులకు సమాచారాన్ని అందించే సమాచార హక్కు చట్టాన్ని, ఉపాధి హామీ పథకాన్ని, ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రజల్ని కాపాడే చట్టాలను మన్మోహన్ సింగ్ తెచ్చారని పేర్కొన్న భట్టి విక్రమార్క, అటవీ హక్కు చట్టం, భూ సేకరణ చట్టం ద్వారా కూడా దేశ ప్రజల హక్కులను పరిరక్షించినట్లు చెప్పారు.
అదేవిధంగా, స్కావెంజర్స్ చట్టాన్ని రద్దు చేసి వారికి భద్రత కల్పించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారని తెలిపారు.