
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు
ఈ వార్తాకథనం ఏంటి
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు .
ఈ విషయాన్ని బుధవారం ఆయన అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. అల్లూరికి ఇచ్చిన ఈ గౌరవం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
2026 డిసెంబరు నాటికి ఈ విమానాశ్రయం పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ, ఆరు నెలల ముందుగానే 2026 జూన్ 26న ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆలోచనలకు అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వివరాలు
మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
అదనంగా, రాష్ట్ర కేబినెట్ మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రామ్మోహన్‌నాయుడు అభినందించారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ, దేశం కోసం సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
సైనికులకు మద్దతుగా, దేశంలోనే తొలిసారిగా జవాన్ డిక్లరేషన్ ప్రకటించామని గుర్తు చేశారు.
యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రత్యేక కార్పొరేషన్‌కు ఆమోదం లభించడం సంతోషకరమని తెలిపారు.
సైనికులు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.