
Bhogapuram: భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టులు.. పర్యాటక, పారిశ్రామిక ప్రగతికి ఊతం
ఈ వార్తాకథనం ఏంటి
విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం మరొక ఏడాదిలో అంతర్జాతీయ గుర్తింపు పొందబోతుంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న విమానాశ్రయ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భోగాపురం చుట్టూ పర్యావరణం, అభివృద్ధి పనులు కొత్త దశలోకి ప్రవేశించాయి. విమానాశ్రయ సమీపంలోని తీరప్రాంతానికి పర్యాటక శాఖకు ప్రభుత్వం గతంలో 80 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో 40 ఎకరాలు మై కేర్ కంపెనీకి, మిగిలిన 40 ఎకరాలు ఒబెరాయ్ గ్రూప్‌కు అప్పగించాయి. భోగాపురం-భీమిలి మండలాల పరిధిలో ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.
వివరాలు
రూ.150 కోట్ల వ్యయంతో కన్వెన్షన్ సెంటర్
చింతపల్లి తీరప్రాంతంలో గతంలో నిర్మించిన పర్యాటక శాఖ కాటేజీలను ప్రస్తుతం ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు అప్పగించారు. నాలుగు ఎకరాలకు పైగా ఉన్న ఈ కాటేజీలను పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇదే ప్రాంతంలో జీఎంఆర్ గ్రూప్ సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది. అదే విధంగా, సమీపంలో ప్రైవేటు రిసార్ట్ యాజమాన్యం రూ.100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రాంతంలోనే రూ.150 కోట్ల వ్యయంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు, భీమిలి మండలం పరిధిలో తాజ్ హోటల్‌ను ఏర్పాటు చేయాలని యాజమాన్యం ముందుకు వచ్చింది.
వివరాలు
ప్రయాణానికి పకడ్బందీ రహదారులు అవసరం
విమానాశ్రయానికి ఒక వైపు 16వ జాతీయ రహదారి, మరోవైపు అందమైన తీరప్రాంతం ఉండటంతో, ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రయాణికులు సులభంగా చేరుకునేందుకు వీఎంఆర్‌డీఏతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కలిపి 15 అనుసంధాన రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. విశాఖ తీర రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే, ఆనందపురం, తగరపువలస ప్రాంతాల మధ్య ఇంకా నాలుగు నుండి ఐదు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి పారిశ్రామికవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇంతలో, రాష్ట్ర ప్రభుత్వం 500 ఎకరాల భూమిని జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ, ఢిల్లీలోని మాదిరిగానే ఒక ఆధునిక టౌన్‌షిప్‌ను ఇక్కడ నిర్మించాలని సంకల్పించింది.
వివరాలు
ఐటీ రంగానికి ప్రోత్సాహం
విమానాశ్రయానికి సమీపంగా వంద ఎకరాలలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ముక్కాం తీరానికి వెళ్లే మార్గంలో ఉన్న కొంగవానిపాలెం వద్ద, పరిశ్రమల శాఖకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 36 ఎకరాలు కేటాయించింది. అయితే, వైకాపా ప్రభుత్వ కాలంలో ఈ ప్రాంత అభివృద్ధిలో విరామం వచ్చింది. తాజాగా కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత,అందులో 23 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలు స్థాపించబోతున్నాయి. అదనంగా, దివీస్ సంస్థకు మరో 10 ఎకరాల భూమిని లాజిస్టిక్ హబ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ హబ్‌లో వివిధ వస్తువులను నిల్వ చేసి, దేశీయ మరియు అంతర్జాతీయంగా ఎగుమతులకు వేదికగా మలచనున్నారు.
వివరాలు
రియల్టీ రంగానికి నూతన ఊపిరి
విమానాశ్రయానికి చేరువగా ఉన్న మండలాల్లో భూములు కొనుగోలు చేసిన ప్రైవేట్ యజమానులు ఇప్పటికే ప్లాట్లుగా అభివృద్ధి చేయడం ప్రారంభించారు. భోగాపురం, పూసపాటిరేగ, తగరపువలస, ఆనందపురం, భీమిలి మండలాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. విమానాశ్రయ పనులు పూర్తయ్యే నాటికి, ఈ టౌన్‌షిప్‌లలో కొన్ని పూర్తవ్వాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.