
Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రముఖ ఎన్సీపీ నేత, వృద్ధ రాజకీయనాయకుడు ఛగన్ భుజ్‌బాల్ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కేబినెట్‌లోకి చేరనున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు ముంబై రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
77 ఏళ్ల భుజ్‌బాల్‌కు అనేక దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. వివిధ ముఖ్యమంత్రుల హయాంలో కేబినెట్ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా సేవలందించారు.
డిసెంబర్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో భుజ్‌బాల్‌కు మంత్రిపదవి దక్కలేదు. దాంతో ఓబీసీ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, మహాయుతి కూటమి ఒప్పందం మేరకు ఇప్పుడు ఆయనను మంత్రిగా చేర్చేందుకు కసరత్తులు జరిగాయి.
Details
గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన భుజ్ బాల్
తాను మళ్లీ మంత్రివర్గంలోకి చేరుతున్నట్లు ఛగన్ భుజ్‌బాల్ స్వయంగా ప్రకటించారు.
మహాయుతి కూటమి కూడా ఆయన ప్రమాణ స్వీకారాన్ని ధృవీకరించింది. నాసిక్ జిల్లాలోని యోలా నియోజకవర్గానికి చెందిన భుజ్‌బాల్ ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1999 అక్టోబర్ 18న డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి, 2003 డిసెంబర్ 23 వరకు పనిచేశారు.
అనంతరం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంలో (2019 నవంబర్ 28 నుండి 2022 జూన్ 29 వరకు) ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు.
ఈసారి ఆయనకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. మంత్రిపదవి ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి అధికారికంగా శాఖలు ప్రకటించనున్నారు.