Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం
ప్రతిపక్ష ఇండియా కూటమిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్‌లో కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను అధిష్టానం నియమించింది. బిహార్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రతో పాటు ఇతర పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీనియర్ పరిశీలకుడిగా నియమించారు. ఇదిలా ఉంటే, నితీష్ మళ్లీ బీజేపీతో కలవనున్నారనే వార్తల నేపథ్యంలో.. రాష్ట్రంలో మహాకూటమి విచ్ఛిన్నమయ్యే దశలో ఉంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ ఇప్పుడు భూపేష్ బఘేల్‌ను బీహార్‌కు పంపింది.
ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం
నితీశ్ కుమార్ ఎన్డీఏలోకి వెళితే.. ఇండియాపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. నిజానికి భారత కూటమికి నాంది పలికిందే నితీశ్ కుమార్. ఇప్పుడు అదే నితీశ్ చేతులు కలిపితే.. ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. మరోవైపు నితీష్ కుమార్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. నితీష్ నిష్క్రమణ వల్ల కూటమికి వచ్చిన ఇబ్బంది ఏం లేదన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో నితీశ్‌పై విశ్వసనీయత పోతుందన్నారు. నితీశ్ ఉదంతం.. ఇప్పుడు బిహార్‌లోనే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నితీశ్ కుమార్ ఇప్పుడు.. మహా కూటమి నుంచి తప్పుకొని.. ఎన్డీయేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
భూపేష్ బఘెల్‌పై పెద్ద బాధ్యత
నితీష్ కుమార్ బిహార్‌లో 'మహాకూటమి' నుంచి వైదొలిగి ఎన్డీయేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈక్రమంలో భూపేష్ బఘేల్‌కు కాంగ్రెస్ పార్టీ పెద్ద బాధ్యతను అప్పగించింది. బిహార్‌లో ఒకవైపు కూటమి విచ్ఛిన్నం నేపథ్యంలో పార్టీలోని నాయకుల సమన్వయం, మరోవైపు, భారత్ జోడో న్యాయ యాత్ర పర్యవేక్ష బాధ్యతలను బఘేల్‌కు అధిష్టానం అప్పగించింది. రాహుల్ గాంధీ అధ్యక్షతన భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 29న బీహార్‌లో ప్రవేశించనుంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ యాత్ర సాగనుంది. రాహుల్ యాత్రలో ఇండియా కూటమి అగ్ర నాయకులు పాల్గొనే అవకాశం ఉంది.