Onions And Tomato Prices: ఆంధ్రప్రదేశ్ లో సబ్సిడీ ధరలకే టమాటా, ఉల్లిపాయలు
భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. సామాన్యులు కొనుగోలు చేయలేని స్థాయిలో ఉల్లిపాయలు, టమాటా ధరలు చేరడంతో, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై టమాట, ఉల్లిపాయలను విక్రయించాలని నిర్ణయించారు. ధరల పెరుగుదలను నియంత్రించడానికి చర్యలు చేపట్టారు, కాబట్టి అవి సాధారణ ధరలకు అందుబాటులో ఉండాలి. ఇదిలా ఉంటే, రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు టమాటా, ఉల్లిపాయల ధరల నియంత్రణ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై టమాట, ఉల్లిపాయలను విక్రయించడానికి ఆదేశించారు.
ఉల్లిపాయలు, టమాటాలను సబ్సిడీపై విక్రయించాలి
ప్రస్తుతం, బహిరంగ మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.70 నుండి రూ.75 వరకు ఉండగా, రైతు బజార్లలో రూ.63 అని మంత్రి తెలిపారు. ధరలు తగ్గే వరకు, ఉల్లిపాయలు, టమాటాలను సబ్సిడీపై కిలో రూ.50కి విక్రయించాలని నిర్ణయించారు. రాయలసీమ జిల్లాల్లో టమాట ధరలు రూ.50 కంటే తక్కువగా ఉండి, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలు కొనసాగేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రజల అవసరాల కోసం కిలో ఉల్లిపాయలను రూ.40 నుండి రూ.45కి విక్రయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
బహిరంగ మార్కెట్లలో అసాధారణ ధరలు
ఉల్లి ధరలు రూ.100కి చేరువలో ఉన్న నేపథ్యంలో, విజయవాడ రైతు బజార్లో ఉల్లిపాయలు కిలో రూ.55-60కి విక్రయించబడుతున్నాయి,అలాగే టమాటా ధరలు రూ.72గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్వహించే రైతు బజార్లలో ధరలు కాస్త తక్కువగా ఉన్నా, బహిరంగ మార్కెట్లలో అసాధారణ ధరలు కలిగిన కూరగాయలు అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా "మేలు రకం" పేరుతో టమాటా, ఉల్లిపాయలు కిలో రూ.100 వరకు విక్రయిస్తున్నారు.
టమాటా మదనపల్లి నుంచి ఉల్లిపాయలు నాసిక్ నుంచి..
ఈ క్రమంలో, రైతు బజార్లలో విక్రయించేందుకు తీసుకొచ్చే కూరగాయలను బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారని, అందువల్ల కొరత ఏర్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలో, టమాటా మదనపల్లి నుంచి ఉల్లిపాయలు నాసిక్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇటీవల జరిగిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో, ప్రభుత్వం ఉల్లి, టమాటా ధరలను నియంత్రించి సబ్సిడీ ధరలతో విక్రయించాలని నిర్ణయించింది.