
Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను పూర్తిగా రీ వాల్యుయేట్ చేయడం సాధ్యం కాదని ఇంటర్ బోర్డు అధికారులు భావించారు.
అందులో భాగంగా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఐదు రకాల స్లాట్లలో ర్యాండమ్ చెకింగ్ చేపట్టనున్నారు.
ఈ క్రమంలో జీరో మార్కులు, 1-10 మార్కులు, 25-35, 60-70, 95-99 మార్కుల మధ్య ర్యేంజ్‌లో ఉన్న ఆన్సర్ షీట్లను ఎంపిక చేసి రీ వాల్యుయేషన్ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 స్పాట్ కేంద్రాల్లో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
మూడురోజుల పాటు సాధారణ రీ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు ర్యాండమ్ చెకింగ్ జరుగనుంది.
Details
ఈనెల 25లోగా ఫలితాలు
అంతేకాకుండా అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసై, ఒకే సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థుల ఆన్సర్ షీట్లను కూడా ప్రత్యేకంగా మళ్లీ చెక్ చేస్తున్నారు.
ఒక ఉదాహరణగా ఒక విద్యార్థికి మొదట 33 మార్కులు రాగా, రీ వాల్యుయేషన్‌లో 36 మార్కులు వచ్చినట్టు ఓ క్యాంప్ ఆఫీసర్ తెలిపారు.
ఈ పేపర్‌ను ఓ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ వాల్యుయేట్ చేసినట్టు గుర్తించారన్నారు. ఈ రీ వాల్యుయేషన్ నిర్ణయం వల్ల కొందరి మార్కుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నెల 25లోగా ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
Details
తప్పుల నివారణ కోసం రీ వాల్యుయేషన్: జయప్రద బాయి
ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రద బాయి మాట్లాడుతూ, వాల్యుయేషన్ ప్రక్రియలో అనుకోకుండా జరిగే తప్పుల నివారణ కోసమే ఈ రీ వాల్యుయేషన్ చేపడుతున్నట్లు తెలిపారు.
విద్యార్థుల హక్కులను కాపాడేందుకు, వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బోర్డు సెక్రటరీ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినవారి పేపర్లు కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.