Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు
తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రంగంలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 'పరిశ్రమ 4.0' పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో ఈ విధానం అమలుకు తెర తీసింది. ఈ కొత్త పాలసీతో ఎంఎస్‌ఎంఈలకు పెట్టుబడులు సులభతరమవుతాయని, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ధృడంగా నమ్ముతోంది.
33 సంవత్సరాలు స్థలాన్నిలీజ్ కు తీసుకొనే అవకాశం
ఈ కొత్త విధానంలో, ఎంఎస్‌ఎంఈలు స్థాపించడానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఇకపై లేకుండా, లీజు పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ లీజు వ్యవస్థలో పరిశ్రమలు 33 సంవత్సరాల పాటు స్థలాన్ని లీజుకు తీసుకుని, ప్రణాళిక ప్రకారం పరిశ్రమలను స్థాపించుకోవచ్చు. ఈ విధానం ద్వారా పరిశ్రమలపై పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవచ్చు. స్థల కొనుగోలుకు అవసరమైన డబ్బును ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.
లీజ్ పద్ధతిలో భవనాలు
ఎంఎస్‌ఎంఈలకు భవనాలను కూడా లీజు పద్ధతిలో ఇవ్వాలని ఈ విధానంలో పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ భవనాలను నిర్మించి పరిశ్రమలకు అద్దెకు ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలు భవన నిర్మాణం కోసం పెట్టుబడి ఖర్చు తగ్గించుకోగలరు. లీజు తీసుకున్న పరిశ్రమలు, నిర్దేశిత గడువులోగా తమ కార్యకలాపాలను ప్రారంభించకపోతే, ప్రభుత్వం ఆ భూములు, భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పించింది.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కృషి
ఎంఎస్‌ఎంఈ పార్క్‌లలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సామాజిక వసతులు ఏర్పాటు చేయాలని కూడా కొత్త పాలసీలో ప్రస్తావించారు. పార్క్‌లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చిన్న పిల్లల సంరక్షణ కేంద్రాలు, కార్మికుల నివాస గదులు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక మహిళా పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించి, పారిశ్రామిక రంగంలో సత్తా చాటేందుకు ఈ వేదికగా మారనుంది.
కొత్త పాలసీ అమలుతో సమస్యలు పరిష్కరం
ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ. 3,736 కోట్ల ప్రోత్సాహక బకాయిల చెల్లింపుపై కూడా దృష్టి పెట్టింది. ఇందులో రూ. 3,008 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు, రూ. 728 కోట్లు భారీ పరిశ్రమలకు సంబంధించినవి. గత ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ, వీటి విడుదల కాకపోవడంతో సమస్య తలెత్తింది. కొత్త పాలసీ అమలుతో ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది.