Page Loader
Chevireddy: బెంగళూరు ఎయిర్‌పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు 
బెంగళూరు ఎయిర్‌పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Chevireddy: బెంగళూరు ఎయిర్‌పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లేందుకు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఇప్పటికే ఆయనపై లుక్‌ఔట్ నోటీసులు అమల్లో ఉండటంతో,చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టంగా తెలిపారు. ఇప్పటికే లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసును సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)గట్టిగా విచారిస్తోంది. ఈ కేసులో చెవిరెడ్డితో సంబంధాలపై అధికారుల దృష్టి కేంద్రీకరించడంతో,ఇటీవల ఆయన గన్‌మెన్ అయిన ఏఆర్ మదన్ రెడ్డిని విచారించారు.

వివరాలు 

ప్రభుత్వానికి సంచలనాత్మక లేఖ 

అయితే అనూహ్యంగా మదన్ రెడ్డి ఈ రోజు ప్రభుత్వానికి సంచలనాత్మక లేఖ రాశారు. ఆ లేఖలో, లిక్కర్ స్కామ్ కేసులో వారు చెప్పిన విధంగా రాసి సంతకం చేయాలని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తనకంటే ముందు విచారణకు హాజరైన గిరి అనే వ్యక్తిని కూడా ఇదే విధంగా ప్రలోభపెట్టారని అధికారులు చెప్పారని మదన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా,విచారణకు తాను పోలీసు యూనిఫాంలో హాజరైనందుకు తిట్టారని,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ స్కామ్‌తో సంబంధం ఉందని చెప్పమని ఆదేశించారని వివరించారు. తాను తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనని చెప్పిన వెంటనే దాదాపు పది మంది అధికారులు తనపై దౌర్జన్యం చేశారని,ఇకపై తాను ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాబోనని స్పష్టంగా పేర్కొన్నారు.