Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని జయభేరి సంస్థకు హైడ్రా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన కట్టడాలను 15 రోజుల్లో తొలగించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఆ కాలపరిమితిలో కట్టడాలు తొలగించకపోతే, తామే కూల్చేస్తామని అధికారులు హెచ్చరించారు.
హైడ్రా నోటీసులపై స్పందిచని జయబేరి సంస్థ
ఈ నిర్మాణాలు మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా నోటీసులపై ఇప్పటివరకు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్న చర్యలలో ఇదొక భాగం. ఇటీవల మాదాపూర్ తుమ్మడికుంట చెరువు పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెషన్ సెంటర్ కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. దుర్గంచెరువు బఫర్ జోన్‌లో ఉన్న కట్టడాలకు కూడా ఇదే విధంగా నోటీసులు జారీ చేశారు.