Bihar Caste Survey: రిజర్వేషన్లు 75 శాతానికి పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60%(కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ఆదేశంతో సహా)నుండి 75%కి పెంచే బిల్లును బిహార్ అసెంబ్లీ గురువారం ఆమోదించిందని పిటిఐ నివేదించింది. ఇతర వెనుకబడిన తరగతులకు(OBCలకు) 18%,అత్యంత వెనుకబడిన తరగతులకు(EBCలకు)25%, షెడ్యూల్డ్ కులాలకు(SCలు) 20%,షెడ్యూల్డ్ తెగలకు (STలు) 2% కోటా కోసం బిల్లు నిబంధనలు రూపొందించింది. రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనకు బీహార్ మంత్రివర్గం ప్రత్యేక సమావేశంలో ఆమోదం తెలిపిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ సమయంలో తెలిపిన విధంగా రాష్ట్రంలో జరిగిన కులాల సర్వేలో తేలినట్లుగా, రాష్ట్ర జనాభాలో వారి వాటాకు అనుగుణంగా వెనుకబడిన తరగతులకు కోటా పెంపును అమలు చేయడానికి బిల్లును తీసుకువస్తామని చెప్పారు.
బీహార్ జనాభాలో 34% మంది "పేదలు"
ఈ ఏడాది అక్టోబర్ 2న బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన మొదటి కులాల సర్వే ఫలితాల ప్రకారం, ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు),అత్యంత వెనుకబడిన తరగతులు (EBCలు) కలిగిన వెనుకబడిన తరగతులు రాష్ట్ర జనాభాలో 64% ఉన్నారు. శాసనసభలో మంగళవారం సమర్పించబడిన కులాల సర్వే నివేదిక నుండి సామాజిక-ఆర్థిక డేటా ప్రకారం, బీహార్ జనాభాలో 34% మంది "పేదలు", అంటే వారి నెలవారీ ఆదాయం ₹6,000 కంటే తక్కువగా ఉంది. సామాజిక-ఆర్థిక డేటాతో కూడిన కులాల సర్వే నివేదికపై చర్చ అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ, కులాల సర్వేపై అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కోటా పెంపు నిర్ణయం సాధ్యమవుతుందని అన్నారు.
1931 తర్వాత ఇదే మొదటి కులాల సర్వే
అన్ని వాస్తవాలను అందరి ముందుకు తీసుకురావడానికి బీహార్ వివరణాత్మక పని చేసింది. 75% కోటా తర్వాత, 25% ఉచిత సీట్లు ఉంటాయి. కోటాను పెంచడం వల్ల OBCలు, EBCలు వారి జనాభాకు అనుగుణంగా ఎక్కువ వాటాను కలిగి ఉంటారు. తమ కులాల సంఖ్య తగ్గిందని,లేదా కొన్ని కులాల లెక్కలు పెంచి వేశారని చెప్పుకునే వారు అర్థంలేకుండా మాట్లాడుతున్నారన్నారు. 1931 తర్వాత ఇదే మొదటి కులాల సర్వే.. ఎలాంటి అధ్యయనం లేకుండా వారి సంఖ్య ఎలా తెలుస్తుందని నితీష్ కుమార్ ప్రశ్నించారు.
కోటా పెంపు నిర్ణయానికి బీజేపీ మద్దతు
రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ కూడా కోటా పెంపు నిర్ణయానికి మద్దతు పలికింది. బీహార్‌లో రిజర్వేషన్ పరిమితుల పెంపునకు బీజేపీ తన పూర్తి మద్దతునిచ్చింది. ఎస్సీలకు 16% రిజర్వేషన్లను 20%కి పెంచాలి. ఎస్టీలకు 1% రిజర్వేషన్లను 2%కి పెంచాలని అభ్యర్థించాము. రిజర్వేషన్ల కోసం ఏ పార్టీకి అయినా బీజేపీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి అన్నారు.