
Bihar Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. రెండు దశల్లో పోలింగ్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మీడియా సమావేశం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల తారీఖులను వెల్లడించారు. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న,రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ప్రారంభమై ఫలితాలు ప్రకటించనున్నట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు CEC స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీకి 243 సీట్లు ఉండగా,ఈ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగుస్తుంది.
వివరాలు
బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు
ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విధంగా గడువులోగా ఎన్నికలను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో ఈ రాష్ట్రంలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అంతకుముందు, బీహార్‌లో ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ప్రకారం, బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 30న ఈ ఓటర్ల జాబితా అధికారికంగా ప్రచురించింది. ఎన్నికల నిశ్పాక్షికత, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 17 కీలక సవరణలను ప్రవేశపెట్టనుంది.
వివరాలు
90,712కి పెరగనున్న పోలింగ్ కేంద్రాలు
వీటిలో కొన్ని సవరణలు పోలింగ్ సమయంలో అమలులోకి వస్తాయి,మరికొన్ని ఓట్ల లెక్కింపు సమయంలో వర్తిస్తాయి. ఇకపై ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు. ప్రస్తుతానికి ప్రతి కేంద్రంలో సుమారు 1,500 మంది ఓటర్లు ఉండగా,ఈ సవరణతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 77,895 నుంచి 90,712కి పెరుగుతుంది.