లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
బిహార్ రాజధాని పాట్నలో రాజకీయ అలజడులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ శ్రేణులపై పోలీసులు జరిపిన లాఠిఛార్జ్ లో ఓ కార్యకర్త మరణించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అగ్గిరాజుకుంది. రాష్ట్రంలో టీచర్ల పోస్టింగులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష బీజేపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బిహార్ ముఖ్యమంత్రి నీతిశ్ కుమార్ కు వ్యతిరేకంగా బారతీయ జనతా పార్టీ శ్రేణులు విధాన సభ మార్చ్ ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే నిరసనగా అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరాయి. సదరు ర్యాలీకి అనుమతులు లేవని, పోలీసులు అడ్డుకున్నారు. తాము అసెంబ్లీకి శాంతియుతంగానే ర్యాలీగా తరలివెళ్తామని బీజేపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో కాషాయ దళాలను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించారు.
భూ కుంభకోణంలో తేజస్వి యాదవ్ పేరుతో ఆందోళనలు ఉద్ధృతం
అనంతరం మరో మెట్టు పెంచుతూ ఏకంగా లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని పాట్నాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జూలై 3న భూ కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది. అప్పట్నుంచి ఆందోళనలను బీజేపీ మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పుడు తాజాగా టీచర్ల పోస్టింగ్స్ అంశంపై నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించింది. తమపై ఎన్నిసార్లు లాఠీ ప్రయోగించినా నితీష్ కుమార్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడతామని బీహార్ ప్రతిపక్ష నేత సామ్రాట్ చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ రాష్ట్రాన్ని గూండాల రాజ్యంగా మార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమపై లాఠీఛార్జ్ చేయిస్తున్నారని మండిపడ్డారు.