Page Loader
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ
.లక్ష కోట్ల కోసమే విలీనమని ఆరోపణ

తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరా లేక కేటీఆరా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎంగా కేటీఆర్‌ను ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్ ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై రాజకీయ యుద్ధం చేశారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న బండి సంజయ్ ఈ మేరకు మళ్లీ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను టీఎస్ఆర్టీసీ కార్మికులు గ్రహిస్తున్నారన్న సంజయ్, లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

DETAILS

వాటిని వీలిన బిల్లులో ఎందుకు పేర్కొనలేదని బండి సంజయ్ ప్రశ్న

రైల్వే పనులను కేంద్రమే చేపడుతోందని బండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. ప్రభుత్వం 15-20 కోట్ల ఆ‍ర్టీసీ నిధులు వాడుకుందని, విలీన బిల్లులో వాటి గురించి ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. కార్మికుల సీసీఎస్‌ సొమ్ము దాదాపు రూ.4,500 కోట్లు, పీఎఫ్‌ నిధులు రూ.9 వేల కోట్లను సైతం కేసీఆరే వాడుకున్నారన్నారు. కార్మికులకు తిరిగి ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. కరీంనగర్, ఆర్మూర్‌లోని ఆర్టీసీ ఆస్తులను ఇప్పటికే లీజు పేరుతో కొల్లగొట్టారని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తుల కోసమే విలీనం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బిల్లులో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన బెనిఫిట్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు.

DETAILS

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం గవర్నర్ కృషి చేస్తున్నారు : బండి

త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేస్తున్న కుట్రలు బయటకు వస్తాయని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల ఓట్ల కోసమే విలీనం చేస్తామంటున్నారని బండి విమర్శించారు. కార్మికులకు లాభం చేకూర్చేందుకే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కృషి చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు తక్షణమే జీతాలను చెల్లించాలన్నారు. ఓ వైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్‌ మాత్రం మహారాష్ట్రలో రాజకీయ సభలు పెట్టుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌ భాష, అహంకారం చూసి ప్రజలు తిరగబడుతున్నట్లు బండి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ బండికి తుప్పు పట్టిపోయిందని ఘాటుగా విమర్శించారు. దీనికి స్పందించిన బండి, కారుకే తుప్పుపట్టిందని కౌంటర్ విసిరడంతో మళ్లీ రాజకీయం వేడిగా మారుతోంది.