Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం.. షెడ్యూల్‌ను ప్రకటించిన బీజేపీ
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిక కాకుండా టీడీపీ, బీజేపీలను ఒక కూటమి ఏర్పాటు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం సంచలన విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. మహారాష్ట్రలో ఈ ఎన్నికలు ముఖ్యంగా బీజేపీ-శివసేన కూటమి (మహాయుతి), కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ మధ్య పోటీ జరుగుతోంది.
నవంబర్ 16, 17న పవన్ కళ్యాణ్ ప్రచారం
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సులభంగా తెలుగు ప్రజల మద్దతు పొందగలిగే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. నవంబర్ 16, 17 తేదీల్లో ఆయన మహారాష్ట్రలో ప్రచార సభలకు హాజరుకానున్నారు. అంతేకాకుండా, ఇటీవల తిరుమల లడ్డూ వివాదం సమయంలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పరిరక్షణపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చకు గురయ్యాయి. ఈ వ్యాఖ్యలు కూడా బీజేపీకి సానుకూలంగా మారాయని భావిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌ను ప్రచారంలో పాల్గొనడమేకాకుండా మరింత ముఖ్యమైన పాత్ర పోషించేందుకు యోచిస్తున్నారు.