అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై చర్చ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అర్ధరాత్రి బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. జులై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి.ఈ మేరకు బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా, ఈజిప్ట్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ఎన్నికల సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హై కమిటీ సమావేశం జరిగినట్టు సమాచారం.
త్వరలోనే బీజేపీ 2024 ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్
అర్థరాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ అభ్యర్థుల జాబితాను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన పైనా కీలక చర్చలు చేశారని వెల్లడవుతోంది. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలనే అంశం చర్చకు వచ్చినట్టు అనుకుంటున్నారు. యూనిఫామ్ సివిల్‌కోడ్‌పై బిల్లు పెడతామని తాజాగా భోపాల్ సభలో మోదీ చెప్పారు. అయితే అదే అంశాన్ని మేనిఫెస్టోలోనూ పొందుపరిచేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు కీలక పార్టీ నేత తెలిపారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం త్వరలోనే బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.