
ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అత్యవసర సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) పట్ల భోపాల్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది.ఈ మేరకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఒకే దేశంలో 2 వేర్వేరు చట్టాలకు చోటు లేదని మోదీ చెప్పిన మాటలపై వర్చువల్ గా ముస్లిం బోర్డు 3 గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం.
న్యాయ పరంగా ఏం చేయాలనే అంశాల మీద సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులు అందించిన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను లా కమిషన్ కు నివేదించాలని ముస్లిం బోర్డు నిర్ణయించింది.
ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ సంప్రదింపులను ప్రారంభించింది. వివిధ మతాల పెద్దల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు ప్రక్రియను చేపట్టింది.
DETAILS
త్వరలోనే కామన్ సివిల్ కోడ్ పై డ్రాఫ్ట్ బిల్లు : మోదీ
ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగం బోధిస్తోందని, సుప్రీం సైతం ఇదే అంశాన్ని పలుమార్లు వెల్లడించినట్లు మోదీ గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే పలు ప్రాంతీయ పార్టీలు ముస్లిం కమ్యూనిటీని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నాయన్నారు.
విపక్షాలు నిత్యం ముస్లిం నామస్మరణే చేస్తాయని,నిజంగా వారికి ముస్లింలపై ప్రేమ ఉంటే విద్య, ఉద్యోగ రంగాల్లో ఎందుకు వెనుకబడి ఉన్నారని నిలదీశారు.
తమ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా ఉంటుందని మోదీ తేల్చి చెప్పారు.
ఒక కుటుంబంలో ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఉంటుందా అని మోదీ అడిగారు. ద్వంద్వ విధానాలు ఉంటే దేశం ముందుకు సాగుతుందా అని నిలదీశారు.
త్వరలోనే యూనిఫాం సివిల్ కోడ్ పై డ్రాఫ్ట్ బిల్లును రూపొందిస్తామన్నారు.