కేసీఆర్ కుటుంబంపై మోదీ చురకలు..కూతురు,కొడుకు, అల్లుడు బాగుండాలంటే బీఆర్ఎస్ కే ఓటేయండని ఎద్దేవా
మధ్యప్రదేశ్ భోపాల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన పొలిటికల్ కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో మేరా బూత్, సబ్‌సే మజ్‌బూత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై ప్రధాని విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కుమార్తె, కుమారుడికి, అల్లుడికి మాత్రమే లాభాం జరగాలంటే బీఆర్ఎస్ కే ఓటేయండని మోదీ చురకలు అంటించారు. మీ పిల్లలు, కుటుంబం బాగుపడాలంటే మాత్రం బీజేపీకే ఓటేయాలని వ్యూహాత్మకంగా సూచించారు.
అవినీతిని వదిలిపెట్టబోమని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ
ఎప్పుడూ వ్యక్తిగతం విమర్శల జోలికి వెళ్లని మోదీ, ఈసారి తన శైలికి భిన్నంగా పలు రాజకీయ పార్టీల అధినేతలు, వారి కుటుంబ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ఇటీవలే విపక్షాలు పట్నాలో నిర్వహించిన భేటీని ఉద్దేశిస్తూ ములాయం యాదవ్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, కరుణానిధి స్టాలిన్లను విమర్శించారు. ఆఖరులో కేసీఆర్, కవిత పేర్లనూ ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో భాజపా గెలవబోతోందని ప్రతిపక్షాలకు అర్థమైందని, అందుకే అవన్నీ ఒకే చోట చేరుతున్నాయన్నారు. ఆయా ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకే హామీ ఇస్తాయని, అందువల్ల తాము అవినీతిని వదిలిపెట్టబోమని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు.