Basavaraj Patil: మహారాష్ట్ర కాంగ్రెస్ కి బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ మంగళవారం తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే,మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడన్వీస్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈరోజు ఉదయం దేవేంద్ర ఫడన్వీస్‌ను ఆయన నివాసంలో పాటిల్ కలిశారు.బసవరాజ్ పాటిల్ ఔసా నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయన మరఠ్వాడా ప్రాంతానికి చెందిన ప్రముఖ లింగాయత్ నాయకుడు కూడా. ఆయన తన మొదటి టర్మ్‌లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 2019లో బీజేపీ నేత అభిమన్యు పవార్ చేతిలో పాటిల్ ఓడిపోయారు.
రాజీనామా వార్తలను ఖండించిన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్
ఇదిలావుండగా, పాటిల్ రాజీనామా వార్తలను కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే ఖండించారు. పాటిల్ నుండి తనకు ఎటువంటి లేఖ రాలేదని చెప్పారు. బసవరాజ్ పాటిల్ నుంచి మాకు ఎలాంటి రాజీనామా లేఖ అందలేదని, ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అయితే చాలా కాలంగా ఎలాంటి సమావేశాలకు హాజరుకావడం లేదని పటోలే చెప్పారు. ఆయన పార్టీలో యాక్టివ్‌గా లేరని.. ఆయన పార్టీని వీడినట్లు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయని, అయితే ఆయన మాతో సంభాషించలేదని ఆయన అన్నారు.