
Sophia Qureshi: కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంపై మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ గురించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఇందౌర్ సమీపంలోని గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ''ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచి,వాళ్లను వితంతువులుగా మార్చారు. అలాంటి వారిని ఎదిరించేందుకు మోదీజీ వారి మతానికి చెందిన సోదరిని(ఖురేషీని)సైనిక విమానంలో పాకిస్తాన్‌కు పంపి వారికి గుణపాఠం చెప్పారు'' అని వ్యాఖ్యానించారు.
ఈవ్యాఖ్యలపై తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతుంది. మంత్రి పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
వివరాలు
ఆమెను అవమానపరిచే ఉద్దేశం తనకు కలలో కూడా లేదని..
మంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా,మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, మధ్యప్రదేశ్ బీజేపీ అధిష్టానం విజయ్ షాను పిలిపించి తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం.
అనంతరం మీడియాతో మాట్లాడిన షా, ఉగ్రవాదుల చర్యలతో తన మనసు బాధతో నిండిపోయిందని, ఆ కోపావేశంలో అలా మాట్లాడినట్లు తెలిపారు.
తాను కర్నల్ ఖురేషీ చేసిన సేవలను మతానికి అతీతంగా గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు.
ఆమెను అవమానపరిచే ఉద్దేశం తనకు కలలో కూడా లేదని అన్నారు.
తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగిందని భావిస్తే, పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.