Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన ఒక్క సీటును కోల్పోవాల్సి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఫలితంగా.. ఇప్పుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోనికి కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైంది. మంగళవారం జరిగిన రాజ్యసభ పోలింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‍కు పాల్పడటంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు చేయిదాటిపోకుండా ఉండేందుకు, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను భూపేంద్ర సింగ్ హుడా, డీకే శివకుమార్‌లకు అప్పగించారు. వీరద్దరూ బుధవారం ఉదయం సిమ్లాకు బయలుదేరారు.
హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగింది?
హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ క్రాస్ ఓటింగ్ కారణంగా బీజేపీకి చెందిన హర్ష్ మహాజన్ చేతిలో ఓడిపోయారు. హిమాచల్ అసెంబ్లీలో 68సీట్లు ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 34ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి కూడా 34ఓట్లు రావడం గమనార్హం. దీంతో డ్రా వేయగా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పోలైన ఓట్లను బట్టి చూస్తే.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. దీంతో కాంగ్రెస్‌కు అసెంబ్లీలో బలం లేదని నిరూపితమైందని, అందుకే తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ నాయకుడు జైరాం ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం గవర్నర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు..
సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. అసంతృప్త ఎమ్మెల్యేలను ఒప్పించే పనిలో నిమగ్నమైంది. ఆరుగురు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు సీనియర్ నేతలు భూపేంద్ర సింగ్ హుడా, డీకే శివకుమార్‌లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు వ్యవహార శైలి పట్ల నిరాశ చెందారని, ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హిమాచల్‌లో లేరని సమాచారం. వారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయగానే.. సిమ్లా నుంచి హర్యానాకు బయలుదేరినట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం సూచన మేరకు వారు హర్యానాకు వెళ్లినట్లు సమాచారం.