త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి..తెలంగాణ బీజేపీ నుంచి ఎన్నో వ్యక్తో తెలుసా
త్రిపుర గవర్నర్ గా నల్లూ ఇంద్రసేనా రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. త్రిపురతో పాటు ఒడిశాకు కొత్త గవర్నర్ ను నియమించారు. ఝార్ఖండ్ మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ నియామకమయ్యారు. గతంలో తెలంగాణ నుంచి ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పని చేసిన వి.రామారావు, విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయలు గవర్నర్ పదవి అలంకరించారు. ఇప్పుడు ఇదే కోవలో నల్లు ఇంద్రసేనా రెడ్డి చేరిపోయారు. మొత్తంగా తెలంగాణ నుంచి నాలుగో గవర్నర్ కానున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు బీజేపీ నేతలు గవర్నర్లు గా పనిచేస్తుండగా, తాజాగా ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియామకమయ్యారు.
ప్రస్తుతం కంభంపాటి, బండారు తర్వాత ఇంద్రసేనా రెడ్డి
నాలుగు దశాబ్దాలకుపైగా ఇంద్రసేనా రెడ్డి బీజేపీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరవం, గుర్తింపు లభించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ అగ్రనేతలకు ఇంద్రసేనా రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మూడో నేత.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ఇద్దరు బీజేపీ నేతలు గవర్నర్లు గా కొనసాగుతున్నారు. మిజోరం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు, హరియాణా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మూడో వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు.
40 ఏళ్ల కాషాయ రాజకీయం
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండలో 1953లో జన్మించిన ఇంద్రసేనా, ఉమ్మడి ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ గా పని చేశారు. మూడు సార్లు (1983, 1985, 1999) మలక్ పేట్ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా విజయం సాధించారు. మలక్ పేట నియోజకవర్గం నుంచే రెండుసార్లు (1989, 1994) ఓటమి చవిచూశారు. 2003 నుంచి 2007 మధ్య కాలంలో బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం కావడం గమనార్హం.