Sandeshkhali: మహిళలపై అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన 'సందేశ్‌ఖాలీ' బాధితురాలకు బిజెపి టికెట్
Sandeshkhali: సందేశ్‌ఖాలీలో (West Bengal) తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన షాజహాన్ షేక్‌కు అకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తిన బాధిత మహిళకు బసిర్‌హట్ నియోజకవర్గ నుంచి పోటీ చేయడానికి బీజేపీ టికెట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరుల అకృత్యాలు అందరికి తెలిసిన విషయమే. అమాయక గిరిజన మహిళలపై దారుణాలకు పాల్పడటమే గాక, వారి భూములను లాక్కొని హింసించారు. షాజహాన్ షేక్ అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన "రేఖ" అనే మహిళ కొద్ది నెలల క్రితం వరకు ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనలను ముందుండి నడిపించారు. నిందితుల బెదిరింపులకు లొంగకుండా ముందుకొచ్చి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
బాధితురాలకు బీజేపీ టికెట్
ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసిన బిజెపి, పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్ స్థానం నుంచి "రేఖా పత్రా"ను ప్రకటించింది. బసిర్‌హట్ లోక్‌సభ స్థానం పరిధిలోనే "సందేశ్‌ఖాలీ" గ్రామం ఉంది. బసిర్‌హట్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ నేత, నటి నుష్రత్ జహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా అధికార పార్టీ ఆమెను పక్కనబెట్టి హజీ నురుల్ ఇస్లామ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా టీఎంసీ, బిజెపి మధ్యే పోరు. అయితే "ఇండియా కూటమి"లో భాగమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఇటీవలే తృణమూల్ ప్రకటించింది.