
PM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరగనుందని హామీ ఇచ్చారు.
దాడికి పాల్పడ్డ ముష్కరులు, వారి వెనుక ఉన్న కుట్రదారులకు అత్యంత కఠినంగా శిక్ష పడుతుందని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం దాడి ఫొటోలు చూస్తే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమై పోరాడుతోందని మోదీ స్పష్టం చేశారు.
Details
భారతీయుల ఐక్యతే గొప్ప బలం
140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే మన అత్యంత గొప్ప బలం అని అన్నారు.
కశ్మీర్ లోయలో శాంతి నెలకొనడం, పాఠశాలలు, కళాశాలలు చైతన్యంతో నిండిపోవడం చూస్తూ ఉగ్రవాద పిండులు (పాకిస్థాన్‌ను ఉద్దేశించి) అసహనంతో తల్లడిల్లుతున్నారని వ్యాఖ్యానించారు.
నిర్మాణాలు వేగంగా కొనసాగడం, పర్యాటకాలు రికార్డు స్థాయిలో పెరగడం, ప్రజాస్వామ్యం బలోపేతం కావడం, ప్రజల ఆదాయం పెరగడం, యువతకు అవకాశాలు పెరగడం చూసి వారు ఓర్చుకోలేకపోయారని పేర్కొన్నారు.
పహల్గాం దాడి ఈ అసహనానికి నిదర్శనమని అన్నారు.
Details
ప్రపంచం మన వెంట ఉంది
కశ్మీర్ అభివృద్ధి శత్రువులకు నచ్చలేదని ప్రధాని చెప్పారు. లోయను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారిని పెంచి పోషించే శక్తులు కుట్ర పన్నాయని వివరించారు.
ఈ దాడి తనను తీవ్రంగా బాధించిందని, బాధిత కుటుంబాల పట్ల భారతదేశమంతా భాష, ప్రాంతం అనే తేడాల్లేకుండా సానుభూతిని చూపుతోందని తెలిపారు.
పహల్గాం దాడిని ఖండిస్తూ అనేక అంతర్జాతీయ నేతలు తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 140 కోట్ల భారతీయులతో పాటు యావత్ ప్రపంచం మనకు మద్దతుగా ఉందని మోదీ తెలిపారు.
Details
భారత్ అంతరిక్ష శక్తిగా ఎదుగుతోంది
ప్రపంచంలో అతి తక్కువ వ్యయంతో అత్యంత విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దేశంగా భారత్ ఎదిగిందని ప్రధాని అన్నారు.
ప్రస్తుతం మనదేశం అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగంలో ముఖ్యశక్తిగా నిలిచిందని తెలిపారు.
యువత ఆధ్వర్యంలో అంకుర సంస్థల (స్టార్టప్‌ల) రంగం వేగంగా ఎదుగుతోందని చెప్పారు. దశాబ్దం క్రితం కేవలం ఒక అంకుర సంస్థ ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 325కి పెరిగిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగానికి 50 ఏళ్లు పూర్తి కావడం గుర్తు చేశారు.
ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడం, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా అవతరించడం, ఆదిత్య-ఎల్1 మిషన్ విజయాలు మన ప్రతిభను చూపించాయని అన్నారు.
Details
కస్తూరిరంగన్‌కు ప్రధాని నివాళి
ఇస్రో మాజీ అధిపతి కె. కస్తూరిరంగన్ సేవలు చిరస్మరణీయమని మోదీ అన్నారు.
ఈ నెల 25న కన్నుమూసిన కస్తూరిరంగన్‌ను గుర్తు చేసుకుంటూ, ప్రతి భేటీలో ఆధునిక విద్య, భారత యువత ప్రతిభ, అంతరిక్ష విజ్ఞానం వంటి అంశాలపై చర్చించేవాళ్లమని చెప్పారు.
అంతరిక్ష ప్రయోగాలు, విద్యా రంగాల్లో ఆయన చేసిన సేవలు దేశానికి అమూల్యమైనవని కొనియాడారు. మహాత్మా గాంధీ తొలి పెద్ద ప్రజా ఉద్యమమైన 1917 నాటి చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రధాని గుర్తు చేశారు.
ఆ ఉద్యమం బ్రిటిష్ పాలకులను గజగజ వణికించిందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి అది మించిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పారు.
Details
'సచేత్' యాప్ ఉపయోగపడుతుంది
విపత్తులపై ప్రజలకు వేగంగా సమాచారం అందించే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన 'సచేత్' యాప్ గురించి మోదీ వివరించారు.
వరదలు, తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులకు ముందస్తు హెచ్చరికల కోసం ఇది ఉపయోగపడుతుందన్నారు.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు 'అమ్మ పేరుతో ఒక మొక్క' ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటారని మోదీ గర్వంగా తెలిపారు.