Page Loader
Rain: ములుగు జిల్లాలో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న బొగత జలపాతం
ములుగు జిల్లాలో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న బొగత జలపాతం

Rain: ములుగు జిల్లాలో వర్ష బీభత్సం.. పొంగిపొర్లుతున్న బొగత జలపాతం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ములుగు జిల్లాలో వర్షాలు విజృంభిస్తున్నాయి. వాజేడు మండలంలోని పేరూరు ప్రాంతంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షపాతం పెరగడంతో, ఈ ప్రాంతానికి సమీపంలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ సందర్శకులను ఆకట్టుకునే విధంగా జలకళను సంతరించుకుంది. అంతేగాక, వెంకటాపురం మండలంలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన ధ్వంసమైంది. దీంతో వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారి పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

వివరాలు 

అత్తచెరువు తూము లీకివ్వడం వల్ల మల్లూరు గ్రామంలో వరదనీరు

వెంకటాపురంలోని బీసీ బాలుర వసతి గృహం చుట్టూ వరద నీరు చేరింది. అందువల్ల విద్యార్థులు బయటకు రాలేక హాస్టల్లోనే ఉండాల్సి వచ్చింది. వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో ఉన్న అత్తచెరువు తూము లీకయ్యింది. దీంతో మల్లూరు గ్రామ పరిధిలోని రమణక్కపేటలోని ఓ ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయింది. తూము లీకివ్వడం వల్ల మల్లూరు గ్రామంలో వరదనీరు ప్రవేశించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏటూరునాగారంలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షాల తీవ్రతతో స్థానిక వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.