Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం... భయాందోళనలో ప్రయాణికులు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానంలో ఓ ప్రయాణికుడు 'తన వద్ద బాంబు ఉంది' అని చెప్పడంతో విమానాశ్రయంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ ప్రయాణికుడి మాటలు విన్న వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడి లగేజ్‌ను ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్నారు. ప్రమాద నివారణ చర్యలతోపాటు, విమానంలో ఉన్న 136 మంది ప్రయాణికులను ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ పరిణామాల కారణంగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం లోపల ఉన్నవారిని సిబ్బంది సురక్షితంగా కిందికి దించారు.
అప్రమత్తమైన అధికారులు
'బాంబు ఉందనే అనుమానంతోనే తనిఖీలు జరుగుతున్నాయి, భయపడవద్దు' అని సిబ్బంది ప్రయాణికులను చెప్పారు. గత కొద్దిరోజులుగా పలు విమానాలకు బూటకపు బాంబు బెదిరింపులు రావడం తెలిసిందే. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా ఇలాంటి బెదిరింపు రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు నిబంధనలలో మార్పులు చేయడం అనివార్యమన్నారు.