Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి.తాజాగా,హైదరాబాద్ ప్రజాభవన్,నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడ బాంబు ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులకు మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు రెండు ప్రాంతాలకు చేరుకుని ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి పెద్దఎత్తున సోదాలు చేపట్టారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌లతో కలిసి ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.సిటీ సివిల్ కోర్టులో బాంబు కాల్ ఫేక్ అని నిర్ధారణకు వచ్చినప్పటికీ, ప్రగతి భవన్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇళ్లు,ఉప ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాలపై బాంబు స్క్వాడ్‌లు ప్రతి అంగుళం సోదా చేశాయి. ఇప్పటి వరకు ఎలాంటి బాంబులు లభ్యం కానప్పటికీ అది ఫేక్ కాల్ అని పోలీసులు ప్రకటించలేదు.
ఫోన్ చేసి వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు
మరోవైపు బాంబు కాల్ గురించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా గత ప్రభుత్వంలో ఈ భవనం ప్రగతి భవన్ గా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజా భవన్ ముందు ఉన్న ఇనుప కంచెనలను కూడా తొలగించారు. ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కొనసాగుతోంది.