ISRO: ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు సందేశం అందింది. సమాచారం అందుకున్న ఇస్రో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాంబు నిర్వీర్య దళంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా చర్యల్లో భాగంగా ఇస్రో ప్రాంగణంలోని సిబ్బందిని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రాంగణంలో ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇది నకిలీ బాంబు బెదిరింపు అయ్యి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ-మెయిల్‌ను ఎవరు పంపారు?అది ఎక్కడి నుంచి పంపించబడింది?అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
గాజియాబాద్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్
సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేసమయంలో నకిలీ బాంబు బెదిరింపు మెయిల్స్‌కు సంబంధించి దిల్లీ పోలీసులు మరో కేసును ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అతడు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ),రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ),కేంద్ర పౌర విమానయాన శాఖతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడు గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పేర్కొన్నారు. అలాగే అతడి నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.