Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత విమానయాన రంగంలో వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.
ఈ బెదిరింపులు విమానయాన సంస్థలకు భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఏయిర్‌లైన్ సంస్థలు ఈ నకిలీ బెదిరింపుల కారణంగా కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నాయి.
అధికారులు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కొన్ని బెదిరింపులు లండన్, జర్మనీ నుండి వచ్చినట్లు సమాచారం. ఇందుకు కారణాలు ఏమిటో, భారత విమానాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
వివరాలు
రూ.80 కోట్ల వరకు నష్టం..
గత సోమవారం నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డొమెస్టిక్,ఇంటర్నేషనల్ విమానాలకు వరుసగా బెదిరింపులు వచ్చాయి.
ముఖ్యంగా,ముంబై నుండి న్యూయార్క్ వెళ్లుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించాల్సి వచ్చింది.
ఈ సంఘటనలో ఆ సంస్థకు సుమారు రూ.3 కోట్ల నష్టం జరిగింది.ఇప్పటి వరకు మొత్తం రూ.80 కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనా.
బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో 130 టన్నుల ఇంధనంతో బయలుదేరింది.
టేకాఫ్ అయిన వెంటనే బెదిరింపు రావడంతో రెండు గంటల లోపే ఢిల్లీలో ల్యాండ్ అయింది.
ఈ సమయానికి సురక్షితంగా ల్యాండ్ కావడం కోసం 100 టన్నుల ఇంధనం వృథా చేయాల్సి వచ్చింది.దీనివల్ల రూ.1 కోటి నష్టం వచ్చింది.
వివరాలు
భారత విమానయాన సంస్థలను లక్ష్యంగా బెదిరింపులు
ఇంకా, ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి, ఈ సంఘటనలో కెనడాలోని ఇకాలూయిట్ అనే మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఈ కారణంగా 200 మంది ప్రయాణికులతో ప్రయాణం ముగించడానికి మూడు రోజుల పాటు సమయం పట్టింది. దీనివల్ల రూ. 15-20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
ఇంధన వ్యయం మాత్రమే కాకుండా, అనుకోని ల్యాండింగ్ ఛార్జీలు, ప్రయాణికుల వసతి, సిబ్బందిని మార్చడం వంటి ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చవుతోంది.
ఈ బెదిరింపులు కావాలనే భారత విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనిపిస్తోంది.
వివరాలు
విదేశీ విమానయాన సంస్థలు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొనలేదు
ఈ చర్యలు ప్రయాణికుల్లో భయాందోళన పెంచడమే కాకుండా, అధికారులపై పనిఒత్తిడి పెంచుతున్నాయి.
మరొవైపు, విదేశీ విమానయాన సంస్థలు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొనలేదు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి దేశీయ సంస్థలనే టార్గెట్ చేయడం గమనార్హం.
దేశీయ విమానాలు కూడా ఈ బెదిరింపుల బాధను అనుభవించాయి. రూట్‌లు మార్చడం వల్ల సంస్థలకు గంటకు రూ. 13 లక్షల నుండి 17 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది.
అంతర్జాతీయ విమానాలలో ఈ నష్టం 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ పరిణామాల వలన మొత్తం రూ. 12 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
ల్యాండింగ్, సిబ్బంది, ఇంధనం, కనెక్టింగ్ ఫ్లైట్ల ఖర్చులు కలిపి ఈ నష్టం రూ. 80 కోట్లకు చేరింది.