Bomb threats: గుజరాత్‌లోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రజలు
గుజరాత్ రాజ్‌కోట్ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, గ్రాండ్ రీజెన్సీ వంటి ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్ల సహా 10 హోటళ్లకు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు అందాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. దీపావళి సందర్భంగా నగరమంతా ఉత్సాహంగా ఉన్న వేళ ఈ ఘటన వెలుగులోకి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. బాంబు బెదిరింపు సందేశంలో, "హోటల్‌లోని ప్రతీ ప్రదేశంలో బాంబులు ఉంచామని, కొన్ని గంటల్లో ఇవి పేలుతాయని, క్షణాల వ్యవధిలో అనేక మంది అమాయకుల ప్రాణాలు పోతాయని చెప్పారు.
హోటళ్లలో తనిఖీలు చేపట్టిన పోలీసులు
వెంటనే హోటల్‌ని ఖాళీ చేయండి అంటూ ఈ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులకు సమచారం అందగానే వారు వెంటనే హోటళ్లలో తనిఖీలను నిర్వహించారు. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు రోజు రోజుకు ఎక్కువతున్నాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై తీవ్రంగా దృష్టి సారించింది. బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని 'నో ఫ్లై' జాబితాలో చేర్చే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది.