BrahMos Exports: బ్రహ్మోస్‌కు పెరుగుతున్న డిమాండ్.. మూడు ఆగ్నేయాసియా దేశాలతో భారత్ డీల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ రక్షణ రంగ ఎగుమతుల్లో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ కీలక స్థానాన్ని సంపాదిస్తోంది. బ్రహ్మోస్ ఎగుమతుల విలువ త్వరలో 600 మిలియన్ డాలర్లను దాటనుందని రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇండోనేషియా, వియత్నాంతో పాటు మరో ఆగ్నేయాసియా దేశానికి బ్రహ్మోస్‌ను విక్రయించేందుకు ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు తెలిపారు. బ్రహ్మోస్ వ్యవస్థలో గాలి నుంచి ప్రయోగించే వెర్షన్ కూడా ఉందని రాజేశ్ కుమార్ సింగ్ చెప్పారు. సుఖోయ్ యుద్ధ విమానాలపై ఈ వెర్షన్ విజయవంతంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 330 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఫిలిప్పీన్స్‌కు అందజేసినట్లు తెలిపారు.
వివరాలు
ఇండోనేషియాకు సుమారు 200 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు
అలాగే వియత్నాంకు దాదాపు 100 మిలియన్ డాలర్లు, ఇండోనేషియాకు సుమారు 200 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగనున్నాయని వివరించారు.
బ్రహ్మోస్‌ను భారత్ అభివృద్ధి చేస్తున్న రక్షణ ఎగుమతుల ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా రాజేశ్ కుమార్ సింగ్ అభివర్ణించారు.
దేశం నుంచి ఎగుమతి చేయగల అత్యున్నత స్థాయి వ్యూహాత్మక వ్యవస్థల్లో ఇది ఒకటని చెప్పారు.
ఫిలిప్పీన్స్‌తో ప్రారంభమైన బ్రహ్మోస్ ఎగుమతులు ఇప్పుడు ఆగ్నేయాసియాలోని మరో మూడు దేశాలకు విస్తరించాయని తెలిపారు.
వివరాలు
ఈ క్షిపణికి గాలి నుంచి ప్రయోగించే వెర్షన్
ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని రక్షణ కార్యదర్శి పేర్కొన్నారు.
ఈ క్షిపణికి గాలి నుంచి ప్రయోగించే వెర్షన్ కూడా ఉంది.ఇది సుఖోయ్ విమానాలపై గొప్ప విజయాన్ని సాధించింది.
బ్రహ్మోస్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ అవకాశాలు ఉన్నాయని,భవిష్యత్తులో భారత రక్షణ ఎగుమతులకు ఇది ప్రధాన ఆధారాల్లో ఒకటిగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఆకాశ్ క్షిపణి వ్యవస్థపైనా రక్షణ కార్యదర్శి ప్రశంసలు కురిపించారు. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే స్వదేశీ ఆకాశ్ వ్యవస్థ.. సైనిక సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా భారత్ ప్రయాణంలో ముఖ్యమైన విజయంగా పేర్కొన్నారు.
దేశీయంగా వస్తున్న భారీ ఆర్డర్లతో పాటు విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆకాశ్ వ్యవస్థ స్థిరమైన ఉత్పత్తి దశలోకి చేరిందన్నారు.
వివరాలు
పెరుగుతున్న స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రతీక బ్రహ్మోస్
స్వదేశీ క్షిపణి రూపకల్పన, తయారీ సామర్థ్యానికి ఆకాశ్ ఒక ఉదాహరణ అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు.
అధిక వేగంతో దూసుకొచ్చే గగనతల లక్ష్యాలను ఎదుర్కొనే సామర్థ్యం ఆకాశ్ వ్యవస్థకు ఉందని వివరించారు.
బ్రహ్మోస్‌ను కేవలం క్షిపణి వ్యవస్థగా కాకుండా భారత్ పెరుగుతున్న స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రతీకగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో అభివర్ణించారు.
బ్రహ్మోస్‌లో సంప్రదాయ వార్‌హెడ్‌తో పాటు అధునాతన మార్గనిర్దేశక వ్యవస్థ ఉంది. సూపర్‌సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది.
వేగం, కచ్చితత్వం, విధ్వంసక సామర్థ్యాల సమ్మేళనం బ్రహ్మోస్‌ను అధునాతన క్షిపణి వ్యవస్థగా నిలబెడుతోంది.
వివరాలు
గణనీయంగా పెరుగుతున్న భారత్ రక్షణ ఎగుమతులు
భారత్ రక్షణ ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు చేరుకున్నాయి.
2024-25లో నమోదైన రూ.23,622 కోట్లతో పోలిస్తే ఇది రూ.14,802 కోట్లు లేదా 62.66 శాతం పెరుగుదల.
ఈ ఎగుమతుల్లో రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు (DPSU) 54.84 శాతం, ప్రైవేటు రంగం 45.16 శాతం వాటాను అందించాయి.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే DPSUల ఎగుమతులు 151 శాతం పెరగగా.. ప్రైవేటు రంగం 14 శాతం వృద్ధిని నమోదు చేసింది.
వివరాలు
గణనీయంగా పెరుగుతున్న భారత్ రక్షణ ఎగుమతులు
విలువ పరంగా DPSUల వాటా రూ.21,071 కోట్లు కాగా.. ప్రైవేటు రంగం రూ.17,353 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో DPSUల ఎగుమతుల విలువ రూ.8,389 కోట్లు కాగా.. ప్రైవేటు రంగం రూ.15,233 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
ప్రస్తుతం భారత్ 80కి పైగా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది.
అలాగే రక్షణ ఎగుమతిదారుల సంఖ్య 128 నుంచి 145కి పెరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.