LOADING...
Telangana: ప్రభుత్వ బడుల్లో అల్పాహారం.. సత్ఫలితాలిచ్చిన ప్రయోగం.. పెరిగిన హాజరు 
ప్రభుత్వ బడుల్లో అల్పాహారం.. సత్ఫలితాలిచ్చిన ప్రయోగం.. పెరిగిన హాజరు

Telangana: ప్రభుత్వ బడుల్లో అల్పాహారం.. సత్ఫలితాలిచ్చిన ప్రయోగం.. పెరిగిన హాజరు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 95 శాతం మంది దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలకు చెందిన ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందినవారు. ఈ పిల్లలలో ఎక్కువ మంది ఉదయం అల్పాహారం లేకుండా పాఠశాలకు వస్తున్నారు. రాత్రి ఎప్పుడో తిన్న తిండి.. మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖాళీ కడుపుతో ఉండాలంటే పెద్దలకే కష్టం. ఇక పిల్లలు తట్టుకోగలరా?.. కొందరు ప్రార్థన సమయంలోనే నీరసంతో కళ్లు తిరిగి పడిపోయేవారు. అయితే, ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి స్వంత నియోజకవర్గం అయిన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఈ సమస్యలతో విద్యార్థులు బాధపడడం లేదు. కారణం అల్పాహార పథకం విజయవంతంగా అమలుపరచబడటమే.

వివరాలు 

ప్రార్థన సమయంలో ఇప్పుడా భయం లేదు 

ఈ పథకానికి ఆర్థిక మద్దతుగా వయాట్రిస్ సంస్థ ముందుకొచ్చింది. అమలు బాధ్యతను హెచ్‌కేఎం (హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌) స్వీకరించింది. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేస్‌ఫాస్ట్‌ అందజేస్తున్నారు. దీంతో హాజరు శాతం పెరిగిందని తెలుస్తోంది. బ్రేస్‌ఫాస్ట్‌ అందించకముందు ప్రార్థన సమయంలో తరచూ విద్యార్థులు ఏమీ తినక.. నీరసంతో కళ్లు తిరిగి కింద పడేవారని.. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని కొడంగల్ బాలికల హైస్కూల్‌లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు ప్రసన్న, తెలుగు ఉపాధ్యాయురాలు ఎస్. ప్రమీల వివరించారు. 'ఇప్పుడు విద్యార్థులు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. టిఫిన్‌ను ఆనందంగా తింటున్నారు' అని కొడంగల్ బాలుర హైస్కూల్‌లో పీఈటీ అజీజ్, తెలుగు ఉపాధ్యాయుడు కన్నయ్య తెలిపారు.

వివరాలు 

3,000 మందివరకూ పెరిగే అవకాశం

కొడంగల్ బాలికల హైస్కూల్‌లో మొత్తం 670 మంది విద్యార్థులు ఉన్నారు. ముందుగా 200 మందికంటే తక్కువ మంది మాత్రమే ప్రార్థనకు హాజరవుతుండగా, ఇప్పుడు ఇది 500 మందికి పెరిగింది. కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి తదితర మండల కేంద్రాల్లోని పాఠశాలలకు సమీప గ్రామాల విద్యార్థులు కూడా వచ్చి చదువుతున్నారు. ఇంట్లో సమయానికి అల్పాహారం వండకపోయినా, ఇప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలోనే భుజిస్తున్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల్లో విద్యార్థుల సంఖ్య గత ఏడాది తో పోల్చితే 3,000 మందివరకూ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికారిక లెక్కలు వెల్లడవ్వాల్సి ఉందని హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

వివరాలు 

నియోజకవర్గంలో అల్పాహారం వివరాలు 

నియోజకవర్గం: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ ప్రారంభం: 2024 డిసెంబరు నుంచి పాఠశాలలు: 306 విద్యార్థులు: 25,500 మంది ఆర్థిక సహకారం: ఏడాది కాలానికిగానూ వయాట్రిస్‌ సంస్థ రూ.6.40 కోట్లు అందజేసింది అల్పాహారం: ఆరు రోజులకు ఆరు రకాలు(ఇడ్లీ-సాంబారు, రాగిఇడ్లి, పూరి- ఆలూ కుర్మా, మైసూరు బోండా- చట్నీ, ఉప్మా-సాంబారు, పొంగల్‌) అమలు బాధ్యతలు: హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌