Brij Bhushan: నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి: బ్రిజ్ భూషణ్
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టులో న్యాయమూర్తి ఆయన్ను, మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి నేరాన్ని అంగీకరిస్తున్నారా అని అడిగినప్పుడు, దానికి సమాధానంగా, తాను నిర్దోషి అని, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్, తన న్యాయవాది ద్వారా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. విదేశాలలో ఆటగాళ్లతో కలిసి ఒకే హోటల్‌లో బస చేయలేదని పేర్కొన్నారు.
బ్రిజ్ భూషణ్‌పై భారతీయ శిక్షాస్మృతిలో.. సెక్షన్ల ప్రకారం కేసు నమోదు
కోర్టు విచారణ అనంతరం బీజేపీ ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఐదుగురు ఫిర్యాదుదారుల ఆరోపణల ఆధారంగా భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354 (దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత శక్తి), 354A (లైంగిక వేధింపులు) కింద కోర్టు సింగ్‌పై అభియోగాలు మోపింది. అదనంగా, రెండు వేర్వేరు కేసుల్లో సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద కూడా అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన కైసర్‌గంజ్ స్థానం నుండి అతనికి కాకుండా ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దించింది.