KCR Protest: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోపించారు. ఎంపీ ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్‌గా ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించడమే అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను కేసీఆర్ ఖండించారు. రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? అని ప్రశ్నించారు.
తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది: కేసీఆర్
సన్న రకం వరి పంటకే బోనస్ ఇస్తూ తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు. రైతుల ఓట్లు పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందన్నారు. ఇదే ఎన్నికల ముందు కాంగ్రెస్ సన్న వడ్లకు మాత్రమే అని ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్ళన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తోందన్నారు. అందుకే రైతుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని కేసీఆర్ అన్నారు.
రైతులకు భరోసా కల్పించేందుకు నిరసన
రైతులకు అండగా నిలవాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఆరోపించారు. రైతులకు అండగా నిలవాలని, రాష్ట్రంలోని రైతులకు భరోసా కల్పించేందుకు ప్రతిరోజు నిర్ణీత నిరసన కార్యక్రమాలతో పాటు వడ్ల కళ్లకాడికి వెళ్లాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.