LOADING...
#NewsBytesExplainer: కవిత మాటల దాడిని ఇన్నాళ్ళు లైట్‌ తీసుకున్న బీఆర్‌ఎస్‌.. ఇక దూకుడు పెంచుతారా?
కవిత మాటల దాడిని ఇన్నాళ్ళు లైట్‌ తీసుకున్న బీఆర్‌ఎస్‌.. ఇక దూకుడు పెంచుతారా?

#NewsBytesExplainer: కవిత మాటల దాడిని ఇన్నాళ్ళు లైట్‌ తీసుకున్న బీఆర్‌ఎస్‌.. ఇక దూకుడు పెంచుతారా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల పాటిస్తున్న ధోరణి బీఆర్‌ఎస్‌ పార్టీకి అసలు నచ్చడంలేదట. పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యాక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నా.. ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారామె. ఈ మాటల దాడిని కూడా పార్టీ పెద్దలు చూసీ చూడనట్టు వదిలేసినా... ఇప్పుడు ఆ పరిస్థితి కూడా హద్దులు దాటుతోందని భావిస్తున్నారట. ఆమె వ్యాఖ్యలు గుచ్చినట్టు, గిల్లినట్టు, సూదితో పొడిచినట్టు ఉండడంతో పాటు... ఇతర పార్టీలకు ఆయుధం ఇచ్చేలా ఉంటున్నట్టు పెద్దలు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. 'జాగృతి జనబాట' పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్న కవిత... అవకాశం దొరికినప్పుడల్లా బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

వివరాలు 

ఇతర పార్టీలు చేసే నష్టం కంటే , కవిత చేస్తున్న నష్టం ఎక్కువ

ఇవన్నీ ఒక వైపు ఉంటే... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి తర్వాత ఆమె ఎక్స్ వేదికగా పెట్టిన 'కర్మ హిట్స్ బ్యాక్' పోస్ట్‌ అయితే పుండు మీద కారం రాసినట్టే అయిందట. ఎవరి కర్మ వాళ్లను చేరుకుంటుందనే భావం వచ్చేలా ఆ మెసేజ్ వైరల్‌ అయ్యింది. "ఎద్దు పుండును కాకి పొడిచినట్టు ఉందే" అని వ్యాఖ్యానించినవాళ్లూ చాలామందే. తర్వాత ఆమె పార్టీ సీనియర్ నేతలపై,హరీష్‌రావుతో సహా,కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న పూర్వ మంత్రులను కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో ఇక నిశ్శబ్దంగా చూస్తూ ఉండటం సరైంది కాదని బీఆర్‌ఎస్‌ నాయకత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇలాగే వదిలేస్తే ఇతర పార్టీలు చేసే నష్టం కంటే , కవిత చేస్తున్న నష్టం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారట.

వివరాలు 

అవసరమైతే కౌంటర్ ఇవ్వండి

ఇప్పటివరకు 'అధినేత కూతురు' అన్న భావనతోనో... ఒకప్పుడు పార్టీతో ఉన్న అనుబంధం కారణంగానో... చాలా మంది నేతలు ఆమెపై పబ్లిక్‌గా మాట్లాడటానికి మొహమాటపడేవారు. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ భవన్ నుంచే "అవసరమైతే కౌంటర్ ఇవ్వండి'' అన్న గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వార్త. అందుకే ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కూడా మాటల దూకుడు పెంచుతున్నారని చెబుతున్నారు. తాజాగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలే మారిన వైఖరికి నిదర్శనం అంటున్నారు. ఇన్నాళ్లు కవితపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించిన నాయకులే ఇప్పుడు 'కారణజన్ముడి కడుపున రాక్షసి పుట్టినట్టుంది' అంటూ కఠిన వ్యాఖ్యలతో రంగంలోకి దిగుతున్నారు. ఇకపై ఈ మాటల ఘాటు మరింత పెరగొచ్చని బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ.

వివరాలు 

రివర్స్ అటాక్ తప్పదు

ఆమె చేస్తున్న విమర్శలు పార్టీ ఇమేజ్‌ను గట్టిగా గాయపరుస్తున్నాయని భావించి... "ఇక రివర్స్ అటాక్ తప్పదు'' అనేది గులాబీ పెద్దల నిర్ణయమట. కవిత పార్టీ నుంచి వెళ్లిపోవటం పెద్ద నష్టం కాదుగానీ... వెళ్లిన తర్వాత చేస్తున్న ఆరోపణలే బీఆర్‌ఎస్‌ నేతలకు శూలాల్లా గుచ్చుకుంటున్నాయన్న అభిప్రాయమే ఇప్పుడు పెరిగిపోయింది. పరిస్థితి కాస్త తీవ్రమైపోయిన నేపథ్యంలో... ఆమెను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది.

వివరాలు 

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కవిత

కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసినప్పటి నుంచే కొందరు నాయకులు ఆమెపై మాట్లాడ్డానికి సిద్ధమైనా... అప్పట్లో అధిష్టానం "శాంతంగా ఉండండి'' అంటూ అడ్డుకుంది. తరువాత కీలక నేతలపై విమర్శలు చేసినప్పుడు కూడా పార్టీ నిశ్శబ్దం పాటించింది. కానీ ఇప్పుడు ఆమె వైపు నుంచి దాడి తీవ్రత పెరిగిపోవడంతో... మళ్లీ మౌనం పాటిస్తే నష్టం మరింత పెరుగుతుందని బీఆర్‌ఎస్‌ నాయకత్వం భావించినట్టు సమాచారం. అందుకే "మీ ఇష్టం... మాట్లాడండి'' అని మరీ కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాబట్టి... బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కవిత మధ్య కొనసాగుతున్న ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి వేడి తెస్తుందో చూడాల్సిందే.