BSF: బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు: చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదిలే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆలోచన అమలు సాధ్యతపై అధ్యయనం చేయాలని బీఎస్‌ఎఫ్ తన ప్రాంతీయ కార్యాలయాలకు సూచనలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రణాళిక ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. పాములు, మొసళ్లను సేకరించడం నుంచి మొదలుకుని, అవి నదీ తీర ప్రాంత ప్రజలపై చూపే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
వివరాలు
ఈ ప్రాంతంలో వరద ముప్పు
భారత్‌కు బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలతో ఉన్న సరిహద్దుల్లో భద్రతా బాధ్యతలు బీఎస్‌ఎఫ్‌దే. తూర్పు సరిహద్దు వెంట అక్రమ రవాణా,చొరబాటు ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళన కేంద్రానికి ఉంది. ఈ సమస్యలను అరికట్టేందుకు పలు మార్గాలను పరిశీలిస్తున్నప్పటికీ,ఈ ప్రాంతంలో వరద ముప్పు ఎప్పటికప్పుడు ఉండటం పెద్ద సవాలుగా మారింది. దీంతో అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం సులభం కావడం లేదు. అంతేకాక,సరిహద్దు ప్రాంతాల్లో జనసాంద్రత కూడా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఫెన్సింగ్‌కు ప్రత్యామ్నాయంగా సరీసృపాలను వినియోగించాలనే ఆలోచన ఉన్నప్పటికీ,ఇది స్థానిక ప్రజలకు ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వరదల సమయంలో పాములు,మొసళ్లు నివాస ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ అన్ని అంశాలను ప్రస్తుతం సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.