
Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరు అంతస్తుల ఈ భవనం పూర్తిగా నేలమట్టమైంది. ప్రాథమికంగా, నిర్మాణ నాణ్యత లోపమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కూలీలు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని ఇళ్లలో ఉన్నవారు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఏమి జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు
మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. భవనం కూలిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భవనం యజమాని శ్రీపతి శ్రీనివాసరావు పరారైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు మేరకు, భవన నిర్మాణం నాసిరకంగా చేపట్టారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
వివరాలు
సామాజిక కార్యకర్తలను బెదిరించిన ఇంటి యజమాని
ఐటిడిఏ పిఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయాలని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇంటి యజమాని సామాజిక కార్యకర్తలను బెదిరించినట్లు సమాచారం. పట్టణంలో అనేక భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం అవుతున్నాయని, ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషాదానికి పంచాయతీ శాఖ పూర్తి బాధ్యత వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.