ఎన్నికల వేళ కేబినెట్‌లో మార్పులు.. నడ్డాను వరుసగా కలుస్తున్న కేంద్రమంత్రులు
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు కేంద్రమంత్రులు, రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు బారులు తీరుతున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ పటేల్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నడ్డాను కలిశారు. మంగళవారం మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, ఎస్పీ సింగ్ బఘేల్, భూపేందర్ యాదవ్‌లు సైతం నడ్డాతో సమావేశమయ్యారు. మరో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవ్య నడ్డాను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొత్తగా నియమితులైన పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ నడ్డాతో సమావేశమయ్యారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం కూడా పలువురు కీలక నాయకులు పార్టీ చీఫ్ ను కలిశారు.
కొత్తవారికి కేంద్ర కేబినెట్ లో చోటు ఇచ్చే అవకాశం
మరో 3 రోజుల్లో జోన్ల వారీగా బీజేపీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. నార్త్ క్లస్టర్‌లో భాగమైన ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల నేతలు జూలై 7న దిల్లీలో భేటీ కానున్నారు. జులై 6న గౌహతిలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల సమావేశం జరగనుంది. జులై 8న దక్షిణాదికి సంబంధించిన సమావేశం జరగనుంది. ఇటీవలే 4 రాష్ట్రాల్లో కొత్త పార్టీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరి, పంజాబ్ సునీల్ జాఖర్, జార్ఖండ్ బాబూలాల్ మరాండీలను అధ్యక్షులుగా ప్రకటించారు. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నారు. అనంతరం మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికల వేళ కొందరిని తప్పించి, కొత్తవారికి చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.