ఎల్జీపై సీఎం కేజ్రీవాల్ గరంగరం.. దిల్లీ గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం
దిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య రాజకీయ ప్రకంపణలు మరోసారి బయటపడ్డాయి. ఎల్జీ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఎల్‌జీ బుధవారం మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. దిల్లీ ప్రభుత్వం పరిధిలోని నిపుణులు, సలహాదారులు తన అనుమతి లేకుండా కార్యకలాపాలు చేపట్టకూడదని సదరు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ఆదేశాలను అన్ని ప్రభుత్వం శాఖలకు పంపించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ కేంద్రం దిల్లీ సర్కారు గొంతును నులిమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరును తాజా ఉత్తర్వులు పూర్తిగా అణచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో ఎల్జీ ఏం సాధించాలనుకుంటున్నారని కేజ్రీ ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై జులై 10న విచారణ
కేంద్రం కనుసన్నల్లో ఎల్జీ తీసుకుంటున్న వివాదాస్పద ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. దిల్లీలోని గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, వారి నియామకాలు, క్రమశిక్షణ చర్యల వంటి వాటిపై గతంలోనే కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వాటి బదిలీలపై నియంత్రణ అధికారం స్థానిక ప్రభుత్వానిదేనని అప్పట్లోనే సుప్రీం తీర్పు వెలువరించింది. అయితే సదరు తీర్పు వచ్చిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ తీసుకురావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దిల్లీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ అంశంపై జులై 10న విచారణ చేసేందుకు సుప్రీం గ్రీన్ స్నిగల్ ఇచ్చింది.