SLBC tunnel collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్..
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం ఎడమ గట్టు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 13 రోజులు గడిచినా, లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
అధికార యంత్రాంగం,రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, ప్రగతి కనిపించడం లేదు.
టన్నెల్ లోపల ఉన్న వారిని గుర్తించేందుకు కేరళ నుండి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌ను రప్పిస్తున్నట్లు విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు.
ఈరోజు ఉదయం టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ఐఐటీ నిపుణులు,సింగరేణి సాంకేతిక నిపుణులు,సైనిక అధికారులు,ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలపై దిశానిర్దేశం చేశారు.
వివరాలు
టన్నెల్ లోపల పనిచేసే సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు
అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ఐఐటీ నిపుణులతో పాటు సైనిక అధికారులు టన్నెల్‌లోకి ప్రవేశించారు.
ఒక చివర నుండి మట్టిని తీయడంతో పాటు ఎస్కలేటర్‌పై వేస్తూ, నీటిని మరో వైపుకు మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహాయాన్ని వినియోగించుకుని, బురదను బయటకు తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారుల సూచన వచ్చింది.
మధ్యాహ్నం వరకు క్యాడవర్ డాగ్స్ టన్నెల్ వద్దకు చేరుకుంటాయని తెలిపారు.
టన్నెల్ లోపల పనిచేసే సిబ్బందికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమీక్షలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులు, సింగరేణి ప్రతినిధులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.